Pages

SrAvaNa nOmulu - vrAtAlu : శ్రావణ నోములు- వ్రతాలు

SrAvaNa month vratAs & nOmulu : : శ్రావణమాసంలో నోములు- వ్రతాలు

శ్రావణం వ్రత సమయం.. శుభతరుణం
సందర్భం - శ్రావణం

శ్రావణమాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇల్లు నోములు, వ్రతాల సందడితో కళకళలాడుతూ లక్ష్మీకళ ఉట్టిపడుతూ ఉంటుంది. తన ప్రాణనాథుడు శ్రీ మహావిష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణానక్షత్రం పేరుమీదుగా వచ్చిన మాసం కాబట్టి లక్ష్మీదేవికి ఈ మాసమంటే ఎంతో ఇష్టం. లక్ష్మీవిష్ణువులకు ప్రీతిపాత్రమైన ఈ మాసం శుభకార్యాలు నిర్వహించేందుకు అత్యంత అనువైంది. ఈ నెల 27 నుంచి శ్రావణమాసం ఆరంభమవుతున్న సందర్భంగా ఈ వ్యాస కుసుమం.

గృహిణులు ఈ నెలరోజులూ ఇంటిముంగిట  శుభ్రంగా ఊడ్చి, కళ్లాపు చల్లి, అందమైన రంగవల్లులు తీర్చిదిద్ది, గుమ్మానికి మంగళతోరణాలు కట్టి, కళకళలాడుతూ ఉంటే కనుక లక్ష్మీదేవి ఆ ఇంటిముంగిలికి వచ్చి, ముగ్గులో కాలుపెట్టి, తాను కొద్దికాలం పాటైనా వసించడానికి ఆ ఇల్లు యోగ్యమైనదా కాదా అని ఆలోచిస్తుందట. చంచల స్వభావురాలైన లక్ష్మీదేవిని కొద్దికాలం పాటైనా మన ఇంటిలో కొలువుండేలా చేయాలంటే ఒకటే మార్గం... ఏ రూపంలోనైనా మన ఇంటికి రాగల అవకాశం ఉన్న శ్రావణమాసంలో ఇంటికి వచ్చిన ముత్తయిదువులను మనసారా ఆహ్వానించి, కాళ్లకు పసుపు పూసి, నొసట బొట్టుపెట్టి, పండ్లు, పూలు, రవికెల గుడ్డ వంటి మంగళకరమైన వస్తువులనిచ్చి మర్యాద చేయడమే.

శ్రావణమాసంలో నోములు- వ్రతాలు
సోమవార వ్రతం: శ్రావణమాసంలో ఆచరించాల్సిన వ్రతాలలో సోమవారం వ్రతం ఎంతో విశిష్టమైనది. ఈ రోజున శివుని ప్రీత్యర్థం ఉపవాసం లేదా నక్తవ్రతాన్ని ఆచరించడం వల్ల సత్ఫలితాలను సాధించవచ్చు. సోమవార వ్రతంలో పగలు ఉపవాసం ఉండి సాయంకాలం శివుని శక్తికొలది అభిషేకించి ఆర్చించాలి. రోజంతా ఉపవసించడం ఈ వ్రతవిధి. ఉండలేనివారు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం పూజానంతరం భుజించవచ్చు.
  
మంగళగౌరీ వ్రతం:
 శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా వివాహమైన స్త్రీలు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని నారదుడు సావిత్రీదేవికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఉపదేశించినట్లుగా చెప్పబడింది. ఈ వ్రతంలో పగలు విధివిధానంగా మంగళగౌరీ దేవిని పూజించాలి. పూజలో ఉత్తరేణి దళాలు, గరికతో గౌరీదేవిని అర్చించడం తప్పనిసరి. మహానివేదనలో పూర్ణపు కుడుములు, పులగం, బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నివేదించాలి. వ్రతం నాటి సాయంత్రం ముత్తైవులను పిలిచి నానబెట్టిన శనగలను వాయనంగా ఇవ్వాలి. ఈ వ్రతంలో తోర పూజ ప్రత్యేకంగా చెప్పబడింది. ఈ వ్రతాన్ని పెళ్లయినప్పటి నుండి అయిదు సంవత్సరాలు ఆచరించాలి. ఏదైనా కారణాల వల్ల ఆటంకం ఏర్పడితే ఆ తదుపరి సంవత్సరం నుండి వ్రతాన్ని కొనసాగించాలి. చివరగా ఉద్యాపన చేసి వ్రతాన్ని ముగించాలి.

వరలక్ష్మీవ్రతం: శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు. ఈ వ్రతాచరణ వల్ల లక్ష్మీదేవి కృప కలిగి కోరిన కోరికలు తీరతాయి. సకల శుభాలూ చేకూరతాయని వ్రత మహాత్మ్యం చెబుతోంది.

సూపౌదన వ్రతం: శ్రావణ శుద్ధ షష్ఠి రోజున ఆచరించే ఈ వ్రతం శివ సంబంధమైనది. సూపౌదనం అంటే పప్పు -అన్నం (సూప: పప్పు, ఓదనం: అన్నం). ఈ రోజున ప్రదోషంలో శివుని షోడశోపచారాలతో పూజించి, బియ్యం, పెసరపప్పు, నెయ్యి, పసుపు, మిరియాలు, ఉప్పు మొదలైన వాటితో వండిన పులగాన్ని నివేదించాలి. ఈ వ్రతాచరణ వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయని పురాణోక్తి.

అవ్యంగసప్తమీ వ్రతం: శ్రావణశుద్ధ సప్తమి రోజున అవ్యంగ సప్తమీ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతంలో సూర్యుణ్ని షోడశోపచారాలతో పూజించాలి. పూజానంతరం సూర్యుని ప్రీతికొరకు నూలు వస్త్రాన్ని దానంచేయాలి. ఈ వ్రతాచరణవల్ల ఆరోగ్యం చేకూరుతుంది.

పుష్పాష్టమీ వ్రతం
శ్రావణ శుద్ధ అష్టమి నుండి పుష్పాష్టమీ వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజున పలురకాల పుష్పాలతో శివుణ్ని పూజించాలి. ఆ తరువాత సంవత్సరం పొడవునా ప్రతి నెలలోనూ శుద్ధ అష్టమి రోజు ఆయా నెలలో లభించే పుష్పాలతో శివుని అర్చించాలి.

అనంగ వ్రతం: శ్రావణశుద్ధ త్రయోదశి నాడు  ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్ర తంలో కుంకుమ కలిపిన అక్షతలతోనూ, ఎర్రని పూలతోనూ రతీమన్మధులను పూజించాలి. ఈ వ్రతాన్ని చేయడం వల్ల భార్యాభర్తల మధ్య వచ్చిన మనస్పర్థలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు

ఈ శ్రావణమాసంలో పర్వదినాలు
జులై 30, బుధవారం: నాగచతుర్థి, కొన్ని ప్రాంతాలలో ఈవేళ నాగుల చవితిగా జరుపుకుంటారు.

ఆగస్టు 1, శుక్రవారం: నాగపంచమి. సకల శుభకార్యాలకు ఈరోజు మంచిది.

ఆగస్టు 6, బుధవారం: శ్రావణ శుద్ధ దశమి. మనిషికి ఉండే ఆశలన్నీ ఈరోజున ఆచరించే వ్రతం వల్ల తీరతాయట. అందుకే దీనికి ఆశాదశమి అని పేరు.

ఆగస్టు 7, గురువారం: పుత్రదా ఏకాదశి. ఈరోజున ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహాజిత్తు అనే రాజు సంతానాన్ని పొందాడు కనుక దీనికే పుత్రదా ఏకాదశి అని పేరు.

ఆగస్టు 8, శుక్రవారం: దామోదర ద్వాదశి. నేడు శ్రీమహావిష్ణువును దామోదరుని రూపంలో పూజించవలసిన రోజు.

ఆగస్టు 10, ఆదివారం: శ్రావణ పూర్ణిమ. యజ్ఞోపవీతం ధరించే ప్రతి ఒక్కరూ నేడు జీర్ణయజ్ఞోపవీతాన్ని విసర్జించి, నూతన యజ్ఞోపవీతాన్ని ధరించడం ఆచారం. అలాగే సోదరులకు, సోదరవాత్సల్యం కలవారికీ నేడు అక్కచెల్లెండ్లు రక్షాబంధనం కట్టడం పురాణకాలం నుంచి వస్తున్న సంప్రదాయం.

ఆగస్టు 14, గురువారం: గురురాఘవేంద్రుల జయంతి. గురు రాఘవేంద్రులవారు మంత్రాలయంలో మహాసమాధి పొందిన పుణ్యతిథి ఇది.

ఆగస్టు 16, శనివారం: శ్రావణ బహుళ షష్ఠి. దీనికి సూర్యషష్ఠి అని పేరు. ఈరోజున  ఆదిత్యహృదయం పారాయణం, సూర్యనమస్కారాలు చేయడం వల్ల శారీరక, మానసిక రుగ్మతలు తొలగి ఆయురారోగ్య ఐశ్యర్యాలు కలుగుతాయని పురాణోక్తి.

ఆగస్టు 17, ఆదివారం: శ్రీ కృష్ణాష్టమి. శ్రీమహావిష్ణువు లోకకళ్యాణం కొరకు కృష్ణావతారంలో భూమిమీద అవతరించిన పర్వదినమిది.

ఇలా ఒకటేమిటి- అనేకానేక పర్వదినాల మయమైన ఈ మాసంలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించడం, సోమవారాలు ఈశ్వరునికి అభిషేకం చేయించడం, శనివారం నాడు వేంకటేశ్వర స్వామివారికి పిండి దీపారాధన చేయడం శుభఫలితాలనిస్తుంది.

లక్ష్మి అంటే కేవలం సంపద మాత్రమే కాదు, సంపద అంటే డబ్బు మాత్రమే కాదు. ఆయుష్షు, ఆరోగ్యం, సౌభాగ్యం, ధనం, ధాన్యం, వస్తువులు, వాహనాలు, పశువులు, పంటలు, బంగారం, వెండి, శాంతి, స్థిరత్వం కూడా! కాబట్టి అష్టైశ్వర్యాలను పొందాలనుకునేవారు అమ్మవారి అనుగ్రహం పొందగలగడానికి అనువైన ఈ మాసం రోజులూ అత్యంత నిష్ఠాగరిష్ఠులై, సంప్రదాయబద్ధులై వ్యవహరించాలని శాస్త్రం చెబుతోంది.

No comments:

Post a Comment

 

Blogger news

In this blog - [ http://dls-joy.blogspot.in/ ]I am posting various articles related to Education, Science and technology, Wonders etc. In my another blog - [ http://depaspi.blogspot.in/ ]I am posting Annamayya Kritis/Keettannas in Telugu and English Translation.

Blogroll

These are the Blogs which I started as a Hobby: http://dls-joy.blogspot.in/ http://depaspi.blogspot.in/

About

These are the collections of various articles related to Education, Science, Technology, General Knowledge, Wonders etc.,from News Papers, magazines, journals and web services like youtube videos etc.