Pages

Inspirators - స్ఫూర్తి ప్రదాతలు

Inspirators - స్ఫూర్తి ప్రదాతలు

సాధారణంగా క్రీడాకారులంటేనే పోరాటయోధులు. ఒక మ్యాచ్‌లో లేదా టోర్నీలో ఓడిపోయినా నీరు గారిపోరు.. కసితో మళ్లీ బరిలోకి దిగుతారు. ఓటమిని జీవన్మరణ సమస్యగా తీసుకుని తాము అనుకున్నది సాధిస్తారు. అయితే ఎదుటివారికి ఆదర్శంగా నిలిచే స్పోర్ట్స్ స్టార్లు కొందరు నిజ జీవితంలోనూ జీవన్మరణ సమస్యల్ని ఎదుర్కొన్నారు. తీవ్రమైన వ్యాధుల బారిన పడినా, వాటిని అధిగమించి మళ్లీ మైదానంలో సత్తా చాటారు. మరికొందరు రిటైర్మెంట్ తర్వాత వ్యాధుల బారిన పడి, వాటిని అధిగమించారు. కొందరైతే తాము అనుభవించిన బాధలు ఎదుటివాళ్లు పడొద్దన్న ఉద్దేశంతో చారిటీలను ఏర్పాటు చేసి బాధితులకు అండగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో కొందరి గురించి...
- శ్యామ్ తిరుక్కోవళ్లూరు

యువరాజ్

క్రికెట్ కెరీర్‌ను కొనసాగిస్తూ క్యాన్సర్ బారిన పడిన ఏకైక క్రికెటర్ యువరాజ్.. 2011లో భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ సాధించిన తర్వాత అనారోగ్యానికి గురయ్యాడు. అయితే ఆ అనారోగ్యానికి కారణం క్యాన్సర్ కణితిగా పరీక్షల్లో తేలింది. యువరాజ్ ఎడమ ఊపిరితిత్తిలో కణితి ఉందని గుర్తించడంతో అమెరికాలోని బోస్టన్‌కు వెళ్లి కీమో థెరపీ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఇండియానాలోనూ చికిత్స పొందాడు. 2012లో పూర్తిగా కోలుకుని మళ్లీ బ్యాట్ పట్టి అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేశాడు. ప్రస్తుతం జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువీ.. ఐపీఎల్ ఏడో సీజన్‌లో రాణించాడు. మొత్తానికి రీ ఎంట్రీలోనూ అదరగొడుతున్న యువరాజ్ అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. ఇక యువరాజ్ ‘యు వియ్ కెన్’ పేరుతో క్యాన్సర్ చారిటీని ఏర్పాటు చేశాడు. ఈ చారిటీ ద్వారా క్యాన్సర్ రోగులను ఆదుకుంటున్నాడు.

టిమ్ హోవార్డ్

అమెరికా స్టార్ గోల్ కీపర్. సాకర్ ప్రపంచకప్‌లో బెల్జియంతో మ్యాచ్‌లో 16 గోల్ ప్రయత్నాలను అడ్డుకుని చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలో ఏ గోల్‌కీపర్‌కు సాధ్యం కాని రీతిలో గోల్‌పోస్ట్ దగ్గర అద్భుతమైన విన్యాసాలు చేశాడు. ఈ మ్యాచ్‌లో అమెరికా చిత్తయినా... బెల్జియం ఆటగాళ్లు గోల్స్ వర్షం కురిపించేందుకు చేసిన ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొన్నాడు. అయితే బంతిని అందుకునేందుకు అతను చేసిన విన్యాసాలు చూసిన వారేవరికైనా సూపర్‌మ్యాన్‌లా కనిపించాడు. టిమ్ హోవార్డ్ అద్భుత ప్రదర్శనకు 9 ఏళ్ల వయసులో అతనికి వచ్చిన టోరెట్టె సిండ్రోమే కారణం. ఈ సిండ్రోమ్ బారిన పడటం వల్ల హోవార్డ్‌కు వెంటనే స్పందించే లక్షణాలు వచ్చాయని న్యూరో స్పెషలిస్టులు చెబుతున్నారు. మెదడులో న్యూరో సెక్రియాట్రిక్ రుగ్మతతో బాధపడిన హోవార్డ్, ఆ తర్వాత దానిని అధిగమించాడు. టోరెట్టె సిండ్రోమ్ నుంచి కోలుకుని గోల్‌కీపర్‌గా రాణించడమంటే మాటలు కాదు.. కఠోర శ్రమ వల్లే అతను ఈ స్థాయికి చేరుకోగలిగాడు. ప్రపంచకప్‌లో హోవార్డ్ అద్భుత ప్రదర్శన అమెరికా అధ్యక్షుడు ఒబామాను ఆకట్టుకోవడమే కాదు.. ఆయన నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు. మొత్తానికి ప్రపంచకప్‌తో అమెరికా ఫుట్‌బాల్‌కు నయా స్టార్ దొరికాడు.

మార్టినా నవ్రతిలోవా

టెన్నిస్ దిగ్గజాల్లో మార్టినా నవ్రతిలోవా కూడా ఒకరు. ఒకప్పుడు అంతర్జాతీయ టెన్నిస్‌లో ఓ వెలుగు వెలిగిన నవ్రతిలోవా.. మార్టినా హింగిస్ లాంటి టెన్నిస్ స్టార్లకు ఆదర్శం. ప్రస్తుతం కోచ్‌గా సేవలందిస్తున్న ఈ మాజీ చెక్, అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి  బ్రెస్ట్ కాన్సర్ బారిన పడింది. నాలుగేళ్ల కిందట (2010లో) ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించింది. దీనిపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ఈ విషయాన్ని ఆమె బయటపెట్టింది. ఈ సమస్య నుంచి బయటపడిన మార్టినా నవ్రతిలోవా అందరికీ ఆదర్శంగా నిలిచింది.

విల్మా రుడాల్ఫ్

ఈమె జీవితమే ఒక పాఠం.. చిన్నతనంలో పోలియో బారిన పడింది. 12 ఏళ్ల వయసులో రుడాల్ఫ్ కోరింత దగ్గు, తీవ్ర జ్వరం, తట్టు ఇలా అనారోగ్యం నుంచి బయటపడి చివరికి అథ్లెట్‌గా తానేంటో నిరూపించుకుంది. పోలియో కారణంగా ఎడమ కాలులో తేడా ఉండటంతో దాన్ని సరిచేసుకుని ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో సత్తా చాటింది. 1960 ఒలింపిక్స్‌లో రుడాల్ఫ్ మూడు పతకాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఫాస్టెస్ట్ అథ్లెట్‌గా అందరి మన్ననలు పొందిన రుడాల్ఫ్ భావితరాలకు స్ఫూర్తిగా నిలిచింది.

వీనస్ విలియమ్స్

అమెరికా టెన్నిస్ బ్యూటీ... తన చెల్లెలు సెరెనా విలియమ్స్‌తో కలసి టెన్నిస్ కోర్టులో అద్భుతాలు సృష్టించింది. 2000 నుంచి 2010 వరకు టెన్నిస్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన వీనస్.. జగ్రెన్స్ సిండ్రోమ్ అనే అరుదైన స్వయం నిరోధిత లోపంతో బాధపడింది. ఆయాసం, కీళ్లనొప్పి కారణంగా 2011లో యూఎస్ ఓపెన్ మధ్యలోనే నిష్ర్కమించింది. జగ్రెన్స్ నుంచి బయటపడిన ఈ అమెరికా స్టార్.. 2012లో వింబుల్డన్ మహిళల డబుల్స్‌లో సెరెనాతో కలసి టైటిల్‌ను చేజిక్కించుకుంది. అదే ఏడాది లండన్ ఆతిథ్యమిచ్చిన ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించింది. మళ్లీ టెన్నిస్‌లో తనదైన ముద్ర వేసేందుకు ఈ బ్లాక్ బ్యూటీ ప్రయత్నిస్తోంది.

లో గెహ్రాగ్

అమెరికాకు చెందిన అద్భుతమైన బేస్‌బాల్ ఆటగాడు. అమ్యోట్రోఫిక్ లాటరల్ స్ల్కేరోసిస్(ఏఎల్‌ఎస్) కారణంగా 37 ఏళ్లకే కన్నుమూసిన గెహ్రాగ్.. తాను ఈ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని కెరీర్‌ను కొనసాగిస్తున్న సమయంలోనే బయట పెట్టాడు. సాధారణంగా ఎవరైనా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఆ విషయాన్ని బయటపెట్టేందుకు అస్సలు ఇష్టపడరు. అయితే గెహ్రాగ్ మాత్రం అలా చేయలేదు. ఏఎల్‌ఎస్ విషయాన్ని బయట పెట్టడంతో ఇప్పుడు అంతా దీన్ని లో గెహ్రాగ్ వ్యాధి అని పిలుస్తుంటారు. అంతేకాదు తనకు వ్యాధి ఉందన్న సంగతిని బయటపెట్టిన తొలి క్రీడాకారుడు కూడా గెహ్రాగే.

మొహమ్మద్ అలీ

అమెరికాకు చెందిన 72 ఏళ్ల బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ.. కెరీర్ ముగిశాక పార్కిన్సన్ వ్యాధి బారిన పడ్డాడు. మూడుసార్లు హెవీ వెయిట్ చాంపియన్‌షిప్ సాధించి చరిత్ర సృష్టించిన అలీలో తొలిసారిగా 1981లో పార్కిన్సన్ లక్షణాలు కనిపించాయి. అయితే మూడేళ్ల తర్వాత (42 ఏళ్ల వయసులో) అది పార్కిన్సనే అని డాక్టర్లు నిర్వహించిన పరీక్షల్లో తేలింది. అప్పటికే బాక్సింగ్ కెరీర్‌ను ముగించిన బాక్సింగ్ దిగ్గజం ఈ వ్యాధిని ఇప్పటికీ ఎదుర్కొంటున్నాడు. 30 ఏళ్లుగా పార్కిన్సన్‌తో పోరాడుతున్న అలీ తనలా వేరేవాళ్లు ఈ వ్యాధి బారిన పడకుండా... 1997లో పార్కిన్సన్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు.

 వ్యాధుల బారిన పడిన ఇతర ప్లేయర్లు...
 అర్థర్ యాష్ (టెన్నిస్)-ఎయిడ్స్/హెచ్‌ఐవీ
 కరీం అబ్దుల్ జబ్బార్ (బాస్కెట్‌బాల్)-లుకేమియా


No comments:

Post a Comment

 

Blogger news

In this blog - [ http://dls-joy.blogspot.in/ ]I am posting various articles related to Education, Science and technology, Wonders etc. In my another blog - [ http://depaspi.blogspot.in/ ]I am posting Annamayya Kritis/Keettannas in Telugu and English Translation.

Blogroll

These are the Blogs which I started as a Hobby: http://dls-joy.blogspot.in/ http://depaspi.blogspot.in/

About

These are the collections of various articles related to Education, Science, Technology, General Knowledge, Wonders etc.,from News Papers, magazines, journals and web services like youtube videos etc.