Ayurvedic Treatment for Chickenpox - చికెన్‌పాక్స్ నివారణకు, చికిత్సకు ఆయుర్వేద మందులు
‘చికెన్‌పాక్స్’, ‘మీజిల్స్’ వ్యాధులను ఆయుర్వేదంలో ‘లఘు మసూరిక’, ‘రోమాంతికా’ అనే పేర్లతో వివరించారు. ఇవి ఒకరి నుంచి మరొకరికి ప్రాప్తించే సాంక్రమిక వ్యాధులు. ఇవి రావడం, రాకపోవడం అన్న అంశం వారి వారి క్షమత్వ శక్తిపై ఆధారపడి ఉంటుంది. నివారణకైనా, చికిత్సకైనా ఈ కింది జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది.ఇంట్లోనూ, పరిసరాల్లోనూ పరిశుభ్రత ముఖ్యం. గాలి, వెలుతురు ధారాళంగా ఉండాలి. సాంబ్రాణి ధూపం రెండుపూటలా వేస్తే మంచిది. వేపకొమ్మలను ఇంటి ద్వారానికి తోరణంగా కడితే చాలా రకాల క్రిములను అవి లాగేసుకుంటాయి. క్రిమిహరణంగా పనిచేస్తుంది.
స్నానానికి పసుపుకలిపిన వేడినీళ్లు మంచివి. అనంతరం బాలునికి కూడా సాంబ్రాణి ధూపం వేయవచ్చు.
పరిశుభ్రమైన బట్టలను ప్రతిరోజూ మారుస్తుండాలి.
ఇలాంటి పరిస్థితుల్లో నీరసం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మంచి బలవర్థకమైన ఆహారాన్ని ఇవ్వాలి. ద్రవాహారం కూడా ఎక్కువగా ఉండాలి. బాదంపప్పు, జీడిపప్పు, ఖర్జూరం, బత్తాయి, కమలాపండ్ల రసాలు చాలా మంచిది.
ఆవుపాలు, ఆవునెయ్యి, ఆవు మజ్జిగ ప్రయోజనకరం.
మందులు
తులసీరసం, తేనె ఒక్కొక్క చెంచా కలిపి, రెండుపూటలా నాకించండి. లేదా తేనెలో రెండు చుక్కల వెల్లుల్లిరసం కలిపి ఇవ్వవచ్చు.
దాల్చినచెక్క చూర్ణం రెండు చిటికెలు, పసుపుముద్ద ఒక చిటికెడు తేనెతో కలిపి రోజుకొక్కసారి తినిపించవచ్చు.
ఆమలకి (ఉసిరిక) రసం ఒక చెంచా రెండుపూటలా ఇవ్వవచ్చు.
బజారులో లభించే మందులు
అరవిందాసవ: ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా నీటితో.
చందనాసవ: ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా నీటితో.
లక్షణాలను బట్టి ప్రత్యేక ఔషధాలు
జ్వరానికి: ఆనందభైరవీరస (మాత్రలు... ఉదయం 1, రాత్రి 1
చర్మంపై పొక్కులు: ‘మహామరిచాది తైలా’న్ని కొంచెం దూదితో, మెల్లగా చర్మంపై పూయాలి.
గమనిక
ఒకవేళ ఈ వ్యాధులు సోకితే, తగ్గిన అనంతరం అశ్రద్ధ చేయకూడదు. వీటి ఉపద్రవాలు కొన్ని సంవత్సరాల తర్వాత కూడా బయటపడవచ్చు. కాబట్టి క్షమత్వ వర్ధకానికై ‘అగస్త్యహరీతకీ రసాయనం’ (లేహ్యం) అనే మందును ఒక చెంచా మోతాదులో రెండు పూటలా, రెండుమూడు నెలల పాటు తినిపించడం మంచిది.
సాంప్రదాయికంగా ఈ జబ్బుల్ని ‘ఆటలమ్మ, అమ్మవారు’ అనే పేర్లతో వ్యవహరిస్తుంటారు. వీటికి మందులు వాడకూడదని నమ్ముతుంటారు. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్లు కనుక వాటికి మందులక్కర్లేదనడం వాస్తవమే అయినా, మూఢవిశ్వాసాలకు తావు లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ వ్యాధి సోకే ముందుగాని, లక్షణాలు బయటపడ్డప్పుడు గాని రోగికి చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ఆయా లక్షణాలను బట్టి శమన చికిత్స కోసం మందులు వాడటం తప్పనిసరి. అదేవిధంగా ఎక్కువ నీరసం ఉంటుంది కాబట్టి బలకర ఔషధాలు కూడా తప్పనిసరి.
వీటి ఉపద్రవాలను నివారించడం కోసం ఆయుర్వేదోక్త రసాయన ద్రవ్యాలను చాలాకాలం వైద్యుని పర్యవేక్షణలో వాడటం అత్యంతావశ్యకమని గుర్తుంచుకోవాలి.
Tags - టాగ్లు: ఆయుర్వేదం, చికెన్‌పాక్స్, Ayurvedam, chicken pox
No comments:
Post a Comment