స్మరణ త్రయోదశి...దీపాల చతుర్దశి
బలిత్రయోదశి: ఈ రోజు ఉదయమే తలస్నానం చేసి మన ఇంటిలో, మన బంధువర్గంలో, అలాగే మనకి జీవితంలో స్థిరపడేందుకు సహాయం చేసిన ఆప్తమిత్రులు, మనకి చక్కటి విద్యాబోధన చేసి, మంచి బుద్ధినిచ్చి, ఇంతటి వాళ్లనుగా తీర్చిదిద్దిన గురువులు లేదా పెద్దలు, మన శ్రేయోభిలాషులను గుర్తు తెచ్చుకోవాలి. వారిలో ఎవరెవరు గతించారో, వారిని పేరు పేరునా తలచుకుంటూ, వారిని మన కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తూ వాళ్లు మనకి చేసిన సహాయాన్ని వివరిస్తూ, ఒక్కొక్కరి పేరున ఒక్కొక్క దీపాన్ని పూజామందిరం వద్ద వెలిగించాలి.
జంతువుల కొవ్వుతో చేసిన కొవ్వొత్తి కాకుండా ప్రమిదలో నూనె పోసి, వత్తిని వెలిగించిన దీపాన్ని మాత్రమే వెలిగించాలి. ఇలా దీపాలని వెలిగించాక యోగ్యుడైన ఒక విప్రుడిని లేదా పండితుడిని పిలిచి, వీటన్నింటినీ పెట్టినందుకు సాక్ష్యంగా మరో దీపాన్ని వెలిగించి, ఆ దీపాన్ని ఆయనకు దానం చేయాలి. ఈ దీపాలనే బలిదీపాలు అంటారు. వీటిని త్రయోదశినాడు పెడతారు కాబట్టి ఈ రోజును బలిత్రయోదశి అని కూడా అంటారు. అపమృత్యుదోషాన్ని పోగొట్టుకునేందుకు ఈ రోజున యమరాజు ఉండే దక్షిణ దిక్కుగా ఒక దీపాన్ని ఉంచాలి. దీనినే యమదీపం అని కూడా అంటారు.
రెండవరోజు నరక చతుర్దశి: ఆదివరాహ రూపంలో ఉన్న శ్రీహరికీ, భూదేవికీ జన్మించిన వాడు నరకుడు. నరాన్ కాయతే ఇతి నరకః అంటే ప్రజలను కాల్చుకుతినేవాడు అని ఈ నరకపదానికి అర్థం. లోకంలో భూదేవికి మించిన సహనం కలవాళ్లెవరూ లేరు. అంటే భూదేవి అంటే... నరకుని తల్లి, తన కుమారుడు ప్రజలను పెట్టే బాధలని చూడలేక, భరించలేక భర్తయైన శ్రీహరితో న రకుణ్ణి వధించి లోకాలని రక్షించవలసిందిగా మొరపెట్టుకుంది.
అప్పుడు శ్రీకృష్ణుని అవతారంలో ఉన్న శ్రీహరి, సత్యభామావతారంలో ఉన్న భూదేవితో కలసి వెళ్లి న రకుడిని సంహరించాడు. దీనినే నరక చతుర్దశిగా జరుపుకుంటాము. ఇందుకు ప్రతీకగా ఆ నరకుని బొమ్మను పనికిరాని కర్రలు, గుడ్డముక్కలతో తయారు చేయించి పిల్లలందరినీ తల్లిదండ్రులు తెల్లవారుజామునే లేపి, దాన్ని కాల్పిస్తూ, ఈ కథని వాళ్లకి బాగా అర్థమయ్యేలా వివరించాలి. పిల్లలుగా ఉన్నప్పుడు మనం చేసే నీతిబోధ వారిలో బాగా నాటుకుంటుంది. కాబట్టి, ఇతరులని ఏడిపించరాదనీ, ఐకమత్యంతో ఉండి పరస్పరం సహకరించుకుంటూ ఉండాలనీ, ఈ పండుగలోని నరకాసుర దహన కాలంలో మనం బోధించాలి.
గంగాస్నానం: గంగాస్నాన ఫలం అందరికీ లభించే అవకాశం ఉన్న ఒకే ఒక్కరోజు నరక చతుర్దశి. ఈ రోజు పిల్లలందరికీ నువ్వుల నూనె ఒంటినిండుగా పట్టించి కొంతసేపు నాననిచ్చి, ఆ మీదట సున్నిపిండితో నలుగు పెట్టి, కుంకుడురసంతో తలస్నానం చేయించాలి. అనంతరం తలచుట్టూ ఆనప (సొర) లేదా ఆముదపు తీగలతో ముమ్మారు తిప్పి, దృష్టిదోషాన్ని తీసివేయాలి. ఆ తర్వాత పెద్దలు కూడా ఇదేవిధంగా అభ్యంగన స్నానం చేయాలి. ఈ వేళ ప్రతి ఒక్కరూ తమ బంధుమిత్రులను ‘నరక చతుర్దశీ గంగాస్నానం అయిందా?’ అని ప్రశ్నించుకోవాలని చెప్పింది శాస్త్రం. ఈ రోజున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగానదీ శక్తి ఉంటుందట.
అపమృత్యుదీపదానం: ఈరోజు కూడా ముందురోజులాగానే మళ్లీ పెద్దలందరినీ పేరు పేరునా తలచుకుంటూ దీపాలు వెలిగించి- ఇన్ని దీపాలని పెట్టినందుకు సాక్ష్యంగా, మరో దీపాన్ని పెట్టి, ఆ దీపాన్ని మళ్లీ ఓ విప్రునికి దానం ఇస్తూ... ‘యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయచ ఔదుంబరాయ దధ్యాయ నీలాయ పరమేష్టినేన అగ్ని దగ్ధాశ్చయే జీవా యేప్య దగ్ధాః కులే మమ ... ఉజ్జ్వల జ్యోతిషా వర్మ ప్రపశ్యంతు వ్రజంతు మే’ అని అనాలి. అంటే ‘నా వంశంలో పెద్దలు అగ్ని కారణంగా గాని, మరే ఇతర కారణంగా కాని మరణించి పితృలోకాలని చేరారో, వారందరికీ నరక బాధ లేకుండా చేసేందుకు భక్తితో, కృతజ్ఞతతో నేనిస్తున్న ఈ దీపం వారికి దోవను చూపుగాక! ఏ యముడు వ్యక్తుల ప్రాణాలను హరిస్తాడో, ఆయన మా ఎవరికీ అపమృత్యుదోషం (అకస్మాత్తుగా అనూహ్యంగా లభించే వాహన ప్రమాద మరణం మొదలైనవి) లేకుండా చేయుగాక అంటూ ఆ దీపాన్ని విప్రునికి దానం చేయాలి.
ఇందులోనుండి మనం గ్రహించవలసినదేమంటే... నరక చతుర్దశినాడు ఆముదపు తీగె లేదా ఆనప తీగెతో దిష్టి తీసి వేస్తున్నాం అంటే... ఆరోగ్యరీత్యా ఆశ్వయుజ కార్తీకమాసాలలో సొరకాయని ఏ విధంగానూ వాడరాదనీ, ఆముదాన్ని కూడా ఉపయోగించరాదనీ తెలుసుకోవాలి. అలాగే కనీసం ఏడాదికి ఒకటి రెండు రోజులైనా సరే, ఒంటికి నువ్వులనూనె పట్టించి, సున్నిపిండితో నలుగుపెట్టుకుని, కుంకుడు కాయ రసంతో తలస్నానం చేయడం ఎంతో మంచిదనీ.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... తమ పుత్రుడు ఎంత నీచుడూ, దుర్మార్గుడూ, ఘాతకుడూ అయినప్పటికీ ఎలాగో వాడికి శిక్షపడకుండా తమకున్న పలుకుబడితో, ధనబలంతో, అంగబలంతో రక్షించుకునే తల్లిదండ్రులనే మనం చూస్తాం. అయితే ప్రాచీన భారతీయ సంప్రదాయంలో తల్లిదండ్రులు ఎంతటి ఉదాత్తమైన చరిత్ర కలవారంటే...ప్రజాకంటకులైన పక్షంలో... లోకక్షేమం కోసం తమ పుత్రుణ్ణి కూడా చంపి, జనరక్షణ చేయవలసిందిగా ప్రార్థించేటంతటి గొప్ప వాళ్లని, అంతేకాదు...జీవించిన వారికే కాదు, గతించిన వారికి సైతం కృతజ్ఞతలు చెల్లించాలని బోధించిన మన పెద్దలకు జేజేలు.
No comments:
Post a Comment