చూసొద్దాం!అలనాటి వైభవం...
ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థగా పేరున్న ‘యునెస్కో’ కార్యాలయం ప్రపంచంలోని అన్ని ప్రాచీన కట్టడాల, జాతీయ ఉద్యానాల, జీవజాలాల పరిరక్షణకు సహకారం అందిస్తోంది. అందులో భాగంగానే ప్రపంచంలోని వేలాది ప్రాచీన కట్టడాలు, జాతీయ ఉద్యానాలు ఈ సమితి జాబితాలో చోటు చేసుకున్నాయి. ఇప్పటికే మన దేశంలోని 25 ప్రాచీన కట్టడాలు, ఏడు జాతీయ ఉద్యానాలు వారసత్వ సంపదలో చోటు చేసుకోగా... ఇంకా వందకు పైగా కట్టడాలు, ఉద్యానాలు పరిశీలనలో ఉన్నాయి.
దక్షిణ భారతదేశానికి సంబంధించి తమిళనాడు, కర్ణాటక, కేరళలు ఇప్పటికే వారసత్వ సంపదలో చేరిన ఘనతను పొందాయి. కానీ తెలుగు రాష్ట్రాలకు ఇంకా ఆ ఘనత లభించలేదు. అయితే ఇటీవల.. అద్భుత శిల్పకళా సంపద, అబ్బురపరిచే అతి పురాతన నిర్మాణ పరిజ్ఞానానికి సజీవ సాక్ష్యంగా ఉన్న వరంగల్ కోట, వేయిస్తంభాల గుడి, రామప్ప దేవాలయం.. ప్రపంచ వారసత్వ సంపద హోదాను కేటాయించే ‘యునెస్కో’ తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయని, ఈ సంవత్సరం చివరిలో పారిస్ నుంచి యునెస్కో ప్రతినిధులు వచ్చి ఈ ప్రాచీన కట్టడాలను పరిశీలిస్తారనే వార్తలు ఇటీవల వచ్చాయి. వీటిలో ఏ ఒక్కటైనా యునెస్కో గుర్తింపు పొందితే తెలుగు రాష్ట్రాల నుంచి ఆ ఘనత సాధించిన తొలి కట్టడంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఆ విధంగా ప్రాచీన వారసత్వ కట్టడాల సందర్శనను మొదలుపెడితే ముందుగా వరంగల్ చేరుకోవచ్చు. అటునుంచి దేశ రాజధాని ఢిల్లీకి చేరి, వివిధ రాష్ట్రాలలో యునెస్కో జాబితాలో ఉన్న కట్టడాలను సందర్శించి, వాటి విశేషాల సమాహారాన్ని తెలుసుకోవచ్చు.
ముందుగా యునెస్కో జాబితా ఖాతా తెరిచిన మన దేశ ప్రాచీన వారసత్వ సంపదలో.. ఆగ్రా కోట, తాజ్‌మహల్, మహారాష్ట్రలోని అజంతా, ఎల్లోరా గుహలు చేరాయి. 1983లో యునెస్కో జాబితాలో ఇవి చేరడంతో మన దేశ ప్రాచీన వారసత్వ సంపద విదేశీ ప్రయాణికులలో ఆసక్తిని కలిగించింది. ఆ విధంగా విదేశీ ప్రయాణికుల రాక మన వద్ద పెరుగుతూ వచ్చింది. వీటికి దగ్గరలోనే ఉన్న కుతుబ్ మినార్, హుమాయూన్ టూంబ్ మరో పదేళ్లకు అంటే 1983లో యునెస్కో జాబితాలో చేరాయి. ఢిల్లీ వెళితే వీటితో పాటు జహంగీర్ ప్యాలెస్, మరో రెండు సుందరమైన మసీదులను చూసి రావచ్చు.
ఆ తర్వాత సంవత్సరం 1984లో తమిళనాడులోని మహాబలిపురం, ఒరిస్సాలోని కోణార్క్ సూర్యదేవాలయాల ఖ్యాతి యునెస్కోలో చేరింది. 1985లో అస్సాంలోని కజిరంగ, మానస్, రాజస్థాన్‌లోని కొలాడియో జాతీయ ఉద్యానాలు చోటు చేసుకోగా..1986లో గోవాలోని చర్చ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్ సిక్రీ, కర్ణాటకలోని హంపీ దేవాలయాలు, మధ్యప్రదేశ్‌లోని ఖజురహో శిల్పసముదాయాలు.. చోటు చేసుకున్నాయి.
1987లో తమిళనాడులోని అతిగొప్పవైన చోళ దేవాలయాలు, కర్ణాటకలోని పట్టాడకల్ ప్రాచీన కట్టడాలు, మహరాష్ట్రలోని ఎలిఫెంటా గుహలు, పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్ జాతీయ ఉద్యానం, 1988లో ఉత్తరాఖండ్‌లోని నందాదేవి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉద్యానం చోటు చేసుకున్నాయి. 1999లో డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేగా పేరుపొందిన మౌంటెయిన్ రైల్వైస్, తర్వాత మరో మూడేళ్లకు బీహార్ రాష్ట్రంలోని మహాబోధి దేవాలయం, 2003లో మధ్యప్రదేశ్‌లోని రాక్‌షెల్టర్స్ భింబెట్కా, 2004లో గుజరాత్‌లోని పావగడ్ ఆర్కియలాజికల్ పార్క్, ముంబయ్‌లోని ఛత్రపతి శివాజి టెర్మినస్‌గా పేరున్న విక్టోరియా టెర్మినస్ చోటు చేసుకోగా 2007లో ఢిల్లీలోని రెడ్‌ఫోర్ట్ కాంప్లెక్స్ యునెస్కో జాబితాలో చేరింది. 2010లో జైపూర్‌లోని జంతర్‌మంతర్, 2012లో వెస్ట్రన్ ఘాట్స్, 2013లో రాజస్థాన్‌లోని హిల్ ఫోర్ట్స్ చోటు చేసుకోగా ఈ ఏడాది ప్రకృతి ప్రసాదితమైన గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్‌కి ఆ గౌరవం దక్కింది.
యునెస్కో జాబితాలో తమ ప్రాంతపు ప్రాచీన కట్టడాలు చేరడం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రతి దేశం భావిస్తుంటుంది. మనకు ఆకాశమంత కీర్తిప్రతిష్టలను తెచ్చిపెట్టే ఈ అద్భుత వారసత్వ సంపద సందర్శన మదిలో ఎప్పటికీ నిలిచిపోయే విజ్ఞాన ఖనిగా భాసిల్లుతూనే ఉంటుంది.
యునెస్కో జాబితాలో చోటు పొందిన ప్రాచీన కట్టడాలు, జాతీయ ఉద్యానవనాల జాబితాను సంవత్సరాల వారీగా విభజించుకుంటే రవాణా మార్గాలను వెతుక్కోవడం సులువు అవుతుంది.
మన దేశంలో ప్రఖ్యాత ప్రాచీన కట్టడాలను చేరుకోవడానికి ఆయా రాష్ట్రాల రాజధానుల నుంచి బస్సు సదుపాయాలు ఉన్నాయి.
ప్రసిద్ధ కట్టడాల గురించి పర్యాటకుల కోసం ట్రావెల్ గైడ్ బుక్స్, ఆడియో రికార్డ్స్ లభిస్తున్నాయి వాటి ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు.
ఆన్‌లైన్ ద్వారా వీటి సమాచారం తెలుసుకోవాలనుకునేవారు ‘గో యునెస్కో’ వెబ్‌సైట్‌కు లాగిన్ అయితే ప్రపంచంలోని వారసత్వ కట్టడాలు, ప్రదేశాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక్కడే యునెస్కో ట్రావెలర్ గ్రూప్స్‌ను కలుసుకునే అవకాశం కూడా ఉంటుంది.
టాగ్లు: సెలవు రోజు, చారిత్రక కట్టడాలు, యునెస్కో జాబితా, ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక,తమిళనాడు, కర్ణాటక, కేరళలు, Holiday, historic monuments, UNESCO list, the United Nations Educational, Scientific and Cultural, Tamil Nadu, Karnataka, Kerala
No comments:
Post a Comment