శరణం... గురు చరణం...
భారతీయ సంప్రదాయంలో గురువుది అత్యున్నతమైన స్థానం. గురువు అనుగ్రహం లేకుండా ఎవ్వరూ జీవిత లక్ష్యాలను సాధించలేరు. తల్లి, తండ్రి, గురువు, అతిథి- ఈ నలుగురు ప్రత్యక్ష గురువులు. భగవంతుని తల్లి, తండ్రి, గురువుల రూపంలోను, తల్లి, తండ్రి, గురువులను భగవంతుని రూపంలోను దర్శించి ఆరాధించడం భారతీయ సంప్రదాయం. సద్గురువును, సదాచార్యుని పొందడం గొప్ప అదృష్టం. యోగ్యత ఉన్న వ్యక్తుల చెంతకు భగవంతుడే ఒక సద్గురువును పంపిస్తాడట. సద్గురువును పొందడానికి యోగ్యత కలగాలంటే సత్సంగంలోనూ, ఆధ్యాత్మిక కార్యకలాపాలలోనూ పాల్గొనడమే సరైన మార్గం. జగద్గురువు ఆదిశంకరులు, భగవద్రామానుజులు, షిరిడి సాయిబాబా వంటివారు కూడా సద్గురు చరణారవిందాలను సేవించినవారే! ఎందుకంటే...
నీటిలోని చేప తన చూపుతోను, తాబేలు తన స్పర్శతోను తమ పిల్లలని సాకినట్లుగా, శిష్యులను ఉత్తములుగా తీర్చిదిద్దగలిగిన మహనీయులే గురువులు. ప్రపంచంలో ఉన్న అనేక రకాల ఆధ్యాత్మిక సాధనలలో ఏది ఎవరికి తగినది? అన్నదానిని సాధకుని యోగ్యతను బట్టి, అవగాహన స్థాయిని బట్టి నిర్ణయించేది, ఉపదేశించేది గురువే. కనుక మన ధర్మంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉండటం వల్ల గురువును దైవంగాను, ఒక్కోసారి దైవం కన్న మిన్నగాను పరిగణించే ఆచారం అనాదిగా వస్తోంది.
అపార జ్ఞానరాశిగా పోగు పడి ఉన్న వేదాలను నాలుగుగా విభజించి, అష్టాదశ పురాణాలను విరచించి, పంచమవేదం వంటి భారత మహేతిహాసాన్ని రచించిన తేజోమూర్తి వేదవ్యాసుడు. వేదవాఙ్మయానికి మూల పురుషుడయిన వ్యాసుడు జన్మించిన ఆషాఢపూర్ణిమను వ్యాసపూర్ణిమగా జరుపుకుంటున్నాం. అపర నారాయణుడయిన ఈయన వల్లనే మన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచమంతటా పరిఢవిల్లాయి. బ్రహ్మసూత్రాలను నిర్మించి, కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలను పటిష్టం చేసిన ఆ వశిష్ఠుని ముని మనుమడయిన వ్యాసుని ఈ రోజు అర్చించడం భారతీయుల కర్తవ్యం.
గురువులలో మొట్టమొదటి వాడు శ్రీకృష్ణుడు. అంతకన్నా ముందు దత్తాత్రేయులవారు. ఆ తర్వాత వేదవ్యాసుడు, ఆయన తర్వాత ఆదిశంకరాచార్యులు, షిరిడి సాయిబాబా, శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, భగవాన్ సత్యసాయి బాబా తదితరులు. వీరెవ్వరితోనూ మనకు ప్రత్యక్షమైన అనుబంధం ఉండచ్చు, ఉండకపోవచ్చు.
అయితే మనకు విద్యాబుద్ధులు నేర్పి, మనం గౌరవప్రదమైన స్థానంలో నిలబడేందుకు బాటలు పరిచిన మన గురువులతో మనకు అనుబంధం, సామీప్యం తప్పనిసరిగా ఉండి ఉంటుంది కాబట్టి గురుపూర్ణిమ సందర్భంగా వారిని స్మరించుకోవటం, సేవించుకోవటం, సన్మానించుకోవటం సముచితం, సందర్భోచితం.
ఒకవేళ మనకు అందుకు వీలు లేనట్లయితే, కనీసం మన పిల్లలకైనా ఆ అవకాశం కల్పించటం, వారి చేత వారి గురువులకు పాదాభివందనం చేయించటం, సమ్మానింపజేయడం మన కనీస ధర్మం.
No comments:
Post a Comment