Inflammation in stomach - Ayurvedic Treatment
కడుపులో మంట, అజీర్ణం, పుల్లటితేన్పులు... తగ్గేదెలా?
మీకు ఉన్న సమస్యను ఆయుర్వేదంలో ‘ఆమ్లపిత్తం’ వ్యాధిగా చెబుతారు. నియమ నిబంధనలకు భిన్నంగా ఆహారవిహారాలు జరిగితే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీనికి తోడు మానసిక ఆందోళన, ఒత్తిడికి గురిచేసే వృత్తివ్యాపారాలు కూడా మరొక ముఖ్యకారణం. ఈ కింది సూచనలు పాటించండి. రెండుమూడు నెలల్లో మీకు గణనీయంగా సత్ఫలితం లభిస్తుంది.
ఆహారం : అల్పాహారమైనా, భోజనమైనా ప్రతిరోజూ నియమిత వేళల్లోనే స్వీకరించాలి. పులుపు, ఉప్పు, కారం పూర్తిగా మానేయండి. తీపిపదార్థాలు, నూనె పదార్థాలు బాగా తగ్గించండి. ప్రతి రెండు గంటలకు ఒక లీటరు నీళ్లు తాగండి. అల్పాహారంలో ఇడ్లీ మంచిది. మొలకలు, గ్రీన్‌సలాడ్స్ కూడా తీసుకోండి. భోజనంలో మసాలాలు లేని శాకాహారం మంచిది. ఆవుపాలు, ఆవుమజ్జిగ వాడండి. బొంబాయిరవ్వ, బార్లీ, రాగులు మొదలైనవాటితో చేసిన జావ అప్పుడప్పుడూ తాగాలి. బయటి తినుబండారాలు, బేకరీ వస్తువులు, జంక్ ఫుడ్స్, శీతలపానీయాల వంటివి అస్సలు పనికిరావు. అరటిపండ్లు మంచిది.
విహారం : నియమతి వేళల్లో రాత్రిపూట నిద్ర అత్యంతావశ్యకం. జాగరణ చేయవద్దు. ధూమపాన, మద్యపానాల వంటి అలవాట్లు వ్యాధిని మరింత ఉద్ధృతం చేస్తాయి. దుఃఖం, చింత, శోకం, భయం వంటి ఉద్వేగాలను దూరంచేసి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. వ్యాయామం వల్ల... ముఖ్యంగా ప్రాణాయామం వల్ల మానసిక ఒత్తిడి దూరమై మీ సమస్య కుదుటపడుతుంది.
మందులు
లఘుసూతశేఖరరస (మాత్రలు) :ఉదయం 2, రాత్రి 2
అవిపత్తికర చూర్ణం : మూడుపూటలా ఒక్కొక్క చెంచా (నీటితో)
శూక్తిన్ (మాత్రలు ) : ఉదయం 1, రాత్రి 1
గమనిక... అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఇతర వ్యాధులుంటే, వాటిని నియంత్రణలోకి తెచ్చుకోవాలి. ప్రతిరోజూ పరగడుపున ఒక అరటిపండు తినడం ఈ సమస్యకు మంచిది.
No comments:
Post a Comment