అష్టాదశ శక్తిపీఠాలలో అరుదైన క్షేత్రం
శ్రీశైలక్షేత్రం గురించిన ప్రసక్తి వేదాలలో, పురాణాలలో, చరిత్రలో, వ్యావహారిక గాథలలో కూడా కనిపిస్తుంది. దక్షిణకాశీగా, దక్షిణ కైలాసంగా వ్యవహరింపబడుతున్న ఈ క్షేత్రం పంచ మహా శివక్షేత్రాలలో ఒకటి. కర్నూలు జిల్లా ఆత్మకూరు తాలూకా నల్లమల అడవులలో అలరారుతున్న శ్రీశైలం అటు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలోనూ, ఇటు అష్టాదశ శక్తి పీఠాలలోనూ ఒకటిగా విరాజిల్లుతోంది.
పురాణగాథ: వినాయకుడు, కుమారస్వామి యుక్తవయస్కులు కావడంతో వారికి గణాధిపత్యం ఇవ్వాలని, వివాహం జరిపించాలని సంకల్పించారు. వారిద్దరినీ పిలిచి ‘మీలో ఎవరు ముందుగా భూప్రదక్షిణం చేస్తారో, వారికే మొదట ఆ పదవిని కట్టబెట్టి, వివాహం చేస్తాము’ అని చెప్పారు. అయితే తన ఎలుక వాహనం మీద భూప్రదక్షిణ చేయడం ప్రయాసతోనూ, ఆలస్యంతోనూ కూడుకున్నది కాబట్టి తరుణోపాయం సూచించమని వినాయకుడు ప్రార్థించడంతో పూజ్యభావంతో మనస్పూర్తిగా మాతాపితరులకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినట్లేనని చెప్పారు.
వినాయకుడు సంతోషించి వారు చెప్పినట్లే చేయడంతో కుమారస్వామి కన్నా ముందుగా భూప్రదక్షిణ చేసినట్లయింది. తను ఎంత కష్టపడి భూ ప్రదక్షిణ చేసినా, అన్నగారికే ఫలితం దక్కిందని అలక వహించిన కుమారస్వామి కైలాసాన్ని వదిలి దక్షిణాన ఉన్న క్రౌంచపర్వతం (శ్రీశైలానికి) వెళ్లిపోయాడు. కుమారునిపై గల ప్రేమతో తల్లి పార్వతి, ఆమెను వెదుకుతూ ఈశ్వరుడు కూడా అక్కడికి వెళ్లారు. ఇలా పార్వతీపరమేశ్వరులు భ్రమరాంబమల్లేశ్వరులనే పేర్లతో శ్రీశైలంపై కొలువుదీరారు.
ఒకప్పుడు అరుణాసురుడనే రాక్షసుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి రెండు కాళ్ల ప్రాణుల నుంచి కాని, నాలుగు కాళ్ల ప్రాణుల నుంచి కాని తనకు మరణం లేకుండా వరం పొందాడు. వరగర్వంతో అతడు అన్ని లోకాలను బాధించసాగాడు. అతడి బారి నుంచి తమను రక్షించవలసిందిగా దేవతలందరూ ఆదిపరాశక్తిని శరణు కోరారు. అప్పుడామె భ్రమర ంగా రూపుదాల్చి, వేలాది తుమ్మెదలను సృష్టించి, అరుణాసురుని సంహరించింది.
ఆ తర్వాత దేవతల కోరికపై ఆదిశక్తి భ్రమరాంబికగా అక్కడే వెలిసింది. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా విలసిల్లుతున్న శ్రీశైలక్షేత్రాన్ని కృతయుగంలో హిరణ్యకశిపుడు, త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో పాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించారని తెలుస్తోంది. పతంజలి మహర్షికంటే ముందుగా యోగశాస్త్రాన్ని బోధించిన గోరక్‌నాథుడు, ఆదిశంకరాచార్యులు, ఆచార్య నాగార్జునులు శ్రీశైలక్షేత్రంలో కొంతకాలం తపస్సు చేశారని తెలుస్తోంది.
చక్రవర్తి అయిన శివాజీ శ్రీశైలంలోని భ్రమరాంబాదేవిని సేవించి, ఆమెను ప్రసన్నం చేసుకుని ఖడ్గాన్ని కానుకగా పొందాడని, నాటి నుంచి ‘ఛత్రపతి శివాజీ’గా ఖ్యాతి గాంచాడని తెలుస్తోంది. అమ్మవారికి మాధవి అని, సర్వమంగళాదేవి అని కూడా పేర్లున్నాయి. ఏ క్షేత్రంలోనూ లేనివిధంగా ఇక్కడ మల్లికార్జునుడికి శివరాత్రికి భ్రమరాంబికాదేవితోనూ, సంక్రాంతికి పార్వతీదేవితోనూ కల్యాణోత్సవాలు జరిపిస్తారు.
ఏడాదికి రెండు కల్యాణోత్సవాలు జరిగే ఏకైక శివక్షేత్రం ఇదే. శ్రీశైల భ్రమరాంబికాదేవి దర్శనం వల్ల సమస్త దోషాలు, సకల పాపాలు మటుమాయమై శాంతిసౌఖ్యాలు చేకూరతాయని, స్వామిని మల్లెపువ్వులతో, అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించిన వారికి సర్వకార్యాలలో విజయం సంప్రాప్తించి కైవల్యప్రాప్తి కలుగుతుందని శివపురాణం ద్వారా తెలుస్తోంది.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సంవత్సరం శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీశైల భ్రమరాంబికాదేవికి అంగర ంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుతుండటం విశేషం.
No comments:
Post a Comment