Pages

India's first victory to Mars - అంగారక యానంలో తొలి గెలుపు

India's first victory to Mars - అంగారక యానంలో తొలి గెలుపు

Sakshi | Updated: November 06, 2013 01:43 (IST)
‘మార్స్ ఆర్బిటర్ మిషన్’ ప్రయోగంలో తొలి దశ విజయవంతం
అరుణగ్రహం దిశగా భారత్ ప్రయాణం మొదలు
శ్రీహరికోట నుంచి విజయవంతంగా రోదసిలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్
పీఎస్‌ఎల్‌వీ-సీ25లో  ‘మామ్’ ప్రయోగం
వరుసగా 24వ సారీ పీఎస్‌ఎల్‌వీ సక్సెస్
రాకెట్ 4 దశలను 49.56 నిమిషాల్లో పూర్తి చేసుకొని కక్ష్యలోకి ‘మామ్’
ఇరవై ఐదు రోజులపాటు భూమి చుట్టూనే పరిభ్రమించనున్న ఆర్బిటర్
తర్వాత 300 రోజుల పాటు ప్రయాణించి అరుణగ్రహ కక్ష్యలోకి
ఇస్రోకిది 109వ ప్రయోగం.. గ్రహాంతర పరిశోధనల్లో ఇదే మొట్టమొదటిది


మహావిశ్వంలో మన దేశం మరో అడుగు ముందుకేసింది. అంతరిక్ష ప్రయోగంలో చరిత్రాత్మక అధ్యాయానికి నాంది పలికింది. గ్రహాంతర పరిశోధనలకు వినువీధిలో మహాయానం మొదలుపెట్టింది. అంగారక గ్రహంపై పరిశోధనల కోసం మార్స్ ఆర్బిటర్ మిషన్(ఎంవోఎం-మామ్)ను ఇస్రో దిగ్విజయంగా నింగిలోకి పంపింది. మంగళవారం మధ్యాహ్నం షార్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్ లాంచర్ సాయంతో ‘మంగళ్‌యాన్’ మొదలైంది. ‘మామ్’ రోదసిలోకి దూసుకెళ్లింది. ఇది మూడు వందల రోజుల పాటు.. దాదాపు 40 కోట్ల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి మంగళగ్రహాన్ని చేరుకుంటుంది. చుట్టూ కొన్ని నెలల పాటు పరిభ్రమిస్తూ అరుణగ్రహంపై జీవాన్వేషణ, ఆ గ్రహం నిర్మాణం, ఖనిజాల మిశ్రమం తదితరాలను శోధిస్తుంది. అంతా సవ్యంగా సాగితే అరుణగ్రహంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. ఇప్పటివరకూ ఈ ఘనతను సాధించిన అమెరికా, రష్యా, ఐరోపాల సరసన నిలుస్తుంది.

సాక్షి, నెల్లూరు/సూళ్లూరుపేట:
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం.. మంగళవారం మధ్యాహ్నం 2:38:26 గంటల సమయం.. మిషన్ కంట్రోల్ రూంలోని శాస్త్రవేత్తల్లో నరాలు తెగే ఉత్కంఠ.. షార్‌లోని అన్ని భవనాలపై నిల్చుని ఆత్రుతగా చూస్తున్న జనం.. నిశ్శబ్ద వాతావరణంలో మైక్‌లో కౌంట్ డౌన్.. త్రీ, టూ, వన్, జీరో.. ఒక్కసారిగా భీకరంగా గర్జిస్తూ.. దట్టమైన పొగలు కక్కుతూ, నిప్పులు చిమ్ముకుంటూ ఓ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. లోపల శాస్త్రవేత్తలు కంప్యూటర్ల ముందు అదే ఉత్కంఠతో పర్యవేక్షిస్తున్నారు.. బయట జనం నింగిలోకి దూసుకెళుతున్న రాకెట్‌కేసి తదేకంగా చూస్తున్నారు. రాకెట్ ఒక్కో దశ దాటుకుంటూ పోతోంది.. మూడు దశల వరకూ శాస్త్రవేత్తల్లో ఉత్కంఠ తగ్గుతూ వస్తోంది.. కానీ నాలుగో దశలో కొన్ని నిమిషాల పాటు మళ్లీ ఉత్కంఠ.. చివరికి అంతా సవ్యంగానే ఉందన్న సమాచారం. సరిగ్గా 49.56 నిమిషాల తర్వాత.. మధ్యాహ్నం 3.22 గంటలకు రాకెట్‌లోని ఉపగ్రహం అంతరిక్ష కక్ష్యలోకి నిర్విఘ్నంగా ప్రవేశించింది. అంతే.. ఒక్కసారిగా శాస్త్రవేత్తల కేరింతలు.. ఒకరినొకరు కౌగిలించుకుని పరస్పర అభినందనలు.. వారి వదనాల్లో ఎప్పటికన్నా ఎంతో విజయగర్వం.. వారికి దేశ నేతల నుంచే కాదు.. ప్రపంచ ప్రముఖుల నుంచీ అభినందనల వెల్లువ! భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇప్పటివరకూ శతాధిక ప్రయోగాలు చేపట్టింది. నిన్నగాక మొన్న ‘చంద్రయాన’ం కూడా చేసింది. అయినా మంగళవారం నాటి ప్రయోగం అంతకన్నా విశిష్టమైనది.. ఇది ‘మంగళయానం’. గ్రహాంతర ప్రయోగం. ఇరవై కోట్లకు పైగా కిలోమీటర్ల దూరంలోని అరుణగ్రహంపై పరిశోధనలకు భారత్ ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎంఓఎం - మామ్)నే ఈ రాకెట్ నింగిలోకి పంపింది. దేశ అంతరిక్ష పరిశోధనలో సరికొత్త చరిత్రకు తొలి అంకం దిగ్విజయంగా లిఖించింది.

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మంగళ్‌యాన్’ ప్రయోగానికి ఆదివారం ఉదయం 6.08 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 56.30 గంటలు నిర్విఘ్నంగా కొనసాగింది. ఉపగ్రహాల ప్రయోగానికి భారత్ తిరుగులేని ఆయుధమైన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ - సీ25 (పీఎస్‌ఎల్‌వీ-సీ25)లో మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను ఉంచి.. మంగళవారం మధ్యాహ్నం 2.38.26 గంటలకు ఆకాశంలోకి ప్రయోగించింది. 44.5 మీటర్ల పొడవైన పీఎస్‌ఎల్‌వీ ఉపగ్రహ వాహకనౌక 1,337 కిలోల బరువున్న మార్స్ ఆర్బిటర్‌ను మోసుకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ఆర్బిటర్‌ను భూమికి దూరంగా భూ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి వుండటంతో.. రాకెట్‌లో అత్యంత శక్తివంతమైన ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లను వినియోగించారు. ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో 75 టన్నుల ఘన ఇంధనం, దీని తరువాత 139 టన్నుల ఘన ఇంధనంతో 112.75 సెకన్లలో 57.678 కిలోమీటర్ల ఎత్తులో మొదటి దశ, ఆ తర్వాత 42 టన్నుల ద్రవ ఇంధనంతో 264.74 సెకన్లలో 132.311 కిలోమీటర్ల ఎత్తులో రెండో దశ, 7.5 టన్నుల ఘన ఇంధనంతో 583.60 సెకెన్లలో 194.869 కిలోమీటర్ల ఎత్తులో మూడో దశ, 2.5 ద్రవ ఇంధనంతో 2,619.72 సెకన్లకు 342.515 కిలోమీటర్ల ఎత్తులో నాలుగో దశను దిగ్విజయంగా పూర్తి చేసింది. తొలి మూడు దశలను విజయవంతంగా పూర్తి చేయటంతో నాలుగో దశ మాత్రం 1,600 సెకెండ్ల పాటు అందరిలోనూ ఉత్కంఠ. ఎందుకంటే ఈ దశలో దక్షిణ ఫసిఫిక్ మహాసముద్రంలో నలంద, యమున నౌకల మీద ఏర్పాటు చేసిన రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు రాకెట్ గమనాన్ని పర్యవేక్షించాయి. అయితే ఈ 1,600 సెకెండ్ల పాటు నౌకల్లో ఏర్పాటు చేసిన రాడార్ ట్రాకింగ్ సిస్టం అద్భుతంగా పనిచేయడంతో ఎక్కడా ఎలాంటి తడబాటు జరగకుండా ప్రయోగం దిగ్విజయంగా జరిగింది. మొత్తం 49.56 నిమిషాల్లో మార్స్ ఆర్బిటర్‌ను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అక్కడి నుంచి ఉపగ్రహంలో వుండే ఇంధనం సాయంతో నాలుగు సార్లు భూ కక్ష్యలో ఉపగ్రహం పరిభ్రమించిన అనంతరం అంగారకుడివైపుకు మళ్లించే ప్రక్రియను చేపడతారు. ఆ తరువాత 310 రోజుల ప్రయాణం అనంతరం.. అంటే 2014 సెప్టెంబర్ 24 నాటికి అంగారకుడి కక్ష్యలో తిరుగుతూ ఆ గ్రహంపై పరిశోధనలను ప్రారంభిస్తుంది. ఇస్రో శాస్త్రవేత్తలు ముందుగా అనుకున్నది అనుకున్నట్టుగా ప్రయోగం జరగడం, మొట్టమొదటి గ్రహాంతర ప్రయోగం విజయవంతం కావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఈ విజయం జాతికి అంకితం: రాధాకృష్ణన్
ఇది సమిష్టి విజయమని.. ఈ విజయం జాతికి అంకితమని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ పేర్కొన్నారు. మార్స్ ఆర్బిటర్ ప్రయోగం అనంతరం ఆయన షార్‌లో మాట్లాడుతూ.. ఇది గ్రహాంతర ప్రయోగం కావడంతో ముందునుంచి అచితూచి అడుగులు వేశామన్నారు. అయితే ప్రయోగం విషయంలో 5 నిమిషాలు పెంచి చేశామన్నారు. భూ కక్ష్యనుంచి అంగారకగ్రహం కక్ష్యలోకి చేరుకోవడానికి ఈ 5 నిమిషాల వ్యవధిని పెంచామని చెప్పారు. ఈ ప్రయోగాన్ని అక్టోబర్ 28న చేయాలని నిర్ణయించామని రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ ఇబ్బందులతో వారం రోజులు వాయిదా వేసుకున్నామని చెప్పారు. ఈ ప్రయోగంలో 9 రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు ఊహించినదానికంటే ఎక్కువగా పనిచేశాయన్నారు. పీఎస్‌ఎల్‌వీ మరోమారు తనసత్తా చాటుకుని ఈ ప్రయోగంతో రజతోత్సవ పీఎస్‌ఎల్‌వీగా గుర్తింపు పొందిందని చెప్పారు. అంగారకప్రయోగం ఇస్రో చరిత్రలో చరిత్రాత్మకమైన ప్రయోగమన్నారు. ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని భారీ ప్రయోగాలకు శ్రీకారం చుడతామని వెల్లడించారు. ప్రధానమంత్రి కార్యాలయ వ్యవహారాల మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. అంగారక ప్రయోగం విజయవంతం కావటం దేశానికే గర్వకారణమన్నారు. మిషన్‌కంట్రోల్ రూంలో శాస్త్రవేత్తలు ఎస్.రామకృష్ణన్, ఎం.వై.ఎస్.ప్రసాద్, ఎం.చంద్రదత్తన్, కున్నికృష్ణన్, ఎస్.కె.శివకుమార్, ఎ.ఎస్.కిరణ్‌కుమార్, అరుణన్, ప్రొఫెసర్ యు.ఆర్.రావు, ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె.కస్తూరిరంగన్, సీనియర్ ప్రొఫెసర్ యశ్‌పాల్ తదితర శాస్త్రవేత్తలు ప్రయోగ విశేషాలను వివరించారు.

No comments:

Post a Comment

 

Blogger news

In this blog - [ http://dls-joy.blogspot.in/ ]I am posting various articles related to Education, Science and technology, Wonders etc. In my another blog - [ http://depaspi.blogspot.in/ ]I am posting Annamayya Kritis/Keettannas in Telugu and English Translation.

Blogroll

These are the Blogs which I started as a Hobby: http://dls-joy.blogspot.in/ http://depaspi.blogspot.in/

About

These are the collections of various articles related to Education, Science, Technology, General Knowledge, Wonders etc.,from News Papers, magazines, journals and web services like youtube videos etc.