Pages

Colourful Fruits for Health

                 Colourful Fruits for Health - ఆరోగ్యానికి రంగులు అద్దుదాం రండి


జీవితం రంగులమయంగా ఉందంటే మీరు ఆనందంగా ఉన్నారని అర్థం. ఆనందంగా ఉన్నారంటే ఆరోగ్యంగానూ ఉన్నారని భావం. జీవితం రంగులమయం కావాలంటే దాన్ని వివిధరంగుల ఆహారపదార్థాలతో ఆరోగ్యమయం చేసుకోవడం ఒక మార్గం. అలా చేసుకోవాలంటే ఏయే రంగుల ఆహారాల్లో ఎలాంటి పోషకాలు ఉన్నాయో తెలుసుకుని వాటిని తీసుకుంటూ ఉంటే... మన ఆరోగ్యాన్ని రంగులమయం చేసుకోవచ్చు. ఆరోగ్యానికి రంగులెలా అద్దాలో తెలుసుకుందాం రండి.

 ఆరోగ్యానికీ రంగుంటుందా? ఉంటుంది... అందుకే ఇంగ్లిష్‌లో హెల్త్‌ను పింక్‌తో సూచిస్తుంటారు. మన ఆరోగ్యం పింక్‌గా ఉండాలంటే మొదట పింక్ రంగు పదార్థాలతోనే మొదలుపెడదాం.

 పింక్ లేదా గులాబీ రంగుల్లో ఉండే ఆహారాలు

 చిలగడదుంప (పైన ఉండే పొర రంగును పరిగణనలోకి తీసుకోవాలి), లోపల తినే భాగం పింక్ రంగుకు దగ్గరగా ఉండే  నారింజపండ్లను తప్పకుండా తినండి. అందులో కెరటినాయిడ్స్ అనే పోషకాలు ఉంటాయి. ఈ కెరటినాయిడ్స్... నోరు, ఫ్యారింగ్స్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నివారించడానికి బాగా తోడ్పడతాయి. వాటితోపాటు ఇందులోనే ఉండే బీటా కెరోటిన్ అనే మరో పోషకం ఈసోఫేగల్ క్యాన్సర్‌ను నివారిస్తుంది. అందుకే ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడే జీర్ణవ్యవస్థకు సంబంధించిన అన్ని రకాల క్యాన్సర్లను నివారించడానికి పింక్ రంగులో ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోండి. ఇక నారింజపండ్లలోని విటమిన్-సి వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. అది అనేక వ్యాధులనుంచి మీకు రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు... ఈ రంగు పదార్థాలు మన కణాల పైన ఉండే పొరను (సెల్‌మెంబ్రేన్)ను పదిలంగా కాపాడుతుంది.

 ఎరుపు రంగు ఆహారాలు:

 ఎరుపు రంగులో ఉండే అన్ని రకాల ఆహారపదార్థాల్లో టొమాటోను ముందుగా చెప్పుకోవాలి. ఇక తినేభాగం ఎర్రగా కనిపించే పుచ్చకాయకు తీసుకున్నా పర్లేదు. ఈ రెండింటిలోనూ లైకోపిన్ అనే పోషకం చాలా ఎక్కువ. లైకోపిన్ పోషకం ప్రోస్టేట్ క్యాన్సర్‌ను సమర్థంగా నివారిస్తుంది. అంతేకాదు... పొట్ట, ఈసోఫేజియల్ క్యాన్సర్ల నివారణకు సమర్థంగా పనిచేస్తుంది. టొమాటోలోని లైకోపిన్ వల్ల గుండెజబ్బులు సమర్థంగా నివారితమవుతాయని అనేక అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు... మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటంలో లైకోపిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

 ఊదా (పర్పుల్) రంగు ఆహారాలు

 ప్రధానంగా ద్రాక్ష, బెర్రీపండ్లు ఈ కలర్‌లో ఉంటాయి. వీటిలో యాంథోసయనిన్ అనే పోషకం ఎక్కువ. గుండెజబ్బుల నివారణకు ఈ పండ్లు ఎక్కువగా తోడ్పడతాయి. ఇక ద్రాక్ష పండ్లు రక్తనాళాల ఆరోగ్య నిర్వహణకు, అవి సన్నగా మారకుండా ఉండేందుకు తోడ్పడతాయి. అందుకే రక్తప్రసరణ వ్యవస్థకు సంబంధించిన అథెరోస్ల్కిరోసిస్, ఏఎస్‌వీడీ వంటి వ్యాధులను నివారణకు ఈ రంగు పండ్లు బాగా దోహదపడతాయి.

 తెల్ల రంగు ఆహారాలు

 తెల్లరంగు ఆహారాల్లో కొన్ని ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు వెల్లుల్లి, ఉల్లిలాంటివి తెల్ల రంగులోనే ఉన్నా... వాటిలోని ఘాటుదనాన్ని పరిగణనలోకి  తీసుకుంటే అలిసిన్ అనే పోషకం వల్ల వాటికా ఘాటుదనం వస్తుంది. ఈ పోషకంలో అనేక మంచి గుణాలుంటాయి. శరీరంలో ఉత్పన్నమయ్యే అనేక రకాల క్యాన్సర్లను అలిసిన్ సమర్థంగా నివారిస్తుంది. రక్తంలోని హానికరమైన కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తపోటును సమతుల్యంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. అందుకే గుండెజబ్బులు, అన్ని రకాల క్యాన్సర్లను (ముఖ్యంగా పొట్ట, పెద్దపేగు, మలద్వార క్యాన్సర్లను) నివారించడానికి వెల్లుల్లి, ఉల్లి బాగా దోహదపడతాయి.

 ఇక కాలీఫ్లవర్, తెలుపురంగు క్యాబేజీ లాంటి కూరలు చేసుకోదగిన పువ్వులు / ఆకులను పరిగణనలోకి తీసుకుంటే ఇందులో ఐసోథయనేట్స్, ఐసోఫేవోన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఈ తెల్లటి ఆహారాల్లో సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు (ఐసోథయనేట్స్, ఐసోఫేవోన్స్) అనేక రకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తాయి. మెదడుకు మంచి చురుకుదనాన్ని సమకూరుస్తాయి.

 పసుపు రంగు ఆహారాలు

 పండినప్పుడు పసుపు రంగులో ఉండే మామిడి, బొప్పాయి వంటి పండ్లను తీసుకుంటే అందులో విటమిన్-ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటిఆరోగ్యానికి దోహదపడుతుంది. ఈ రంగు ఆహారాల్లో కెరటినాయిడ్స్ కూడా ఉంటాయి కాబట్టి రకరకాల క్యాన్సర్ల నివారణకూ అవి దోహదపడతాయి. ఇక ఆ రంగుకు పేరును ఇచ్చే పదార్థమైన పసుపు ప్రాథమిక క్రిమిసంహారిణి అన్న సంగతి తెలిసిందే. అది మన ఆరోగ్యానికి హానిచేసే అనేక రకాల సూక్ష్మక్రిములను నిర్మూలించి అనేక జబ్బులనుంచి రక్షణ కల్పించడంతోపాటు జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్నీ కాపాడుతుంది.

 ఆకుపచ్చ రంగు ఆహారాలు

 ప్రధానంగా కొన్ని రకాల ఆపిల్స్, దాదాపు అన్ని రకాల కూరగాయలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ రంగు ఆహారాల్లో ఫ్లేవనాయిడ్స్ అనే పోషకం ఎక్కువ. గ్రీన్-టీలోనూ ఇది ఎక్కువ పాళ్లలోనే ఉంటుంది. ఫ్లేవనాయిడ్స్‌కు మన శరీరంలోని హానికరమైన ఫ్రీ-రాడికల్స్‌ను నిర్వీర్యం చేసే గుణం ఎక్కువ. దాంతో చర్మం ముడతలను తగ్గించి, దీర్ఘకాలంపాటు యౌవనంగా కనిపించేలా చేయడం, అనేక రకాల క్యాన్సర్లను నివారించడం, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం కలిగి ఉండటం వంటి సుగుణాలన్నీ ఈ ఆకుపచ్చరంగు ఆహారాల్లో పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణం ఉండటం వల్ల మన శరీరంలో వాపు, మంట, నొప్పి వంటి వాటిని కూడా ఈ రంగు ఆహారాలు సమర్థంగా తగ్గిస్తాయి.

No comments:

Post a Comment

 

Blogger news

In this blog - [ http://dls-joy.blogspot.in/ ]I am posting various articles related to Education, Science and technology, Wonders etc. In my another blog - [ http://depaspi.blogspot.in/ ]I am posting Annamayya Kritis/Keettannas in Telugu and English Translation.

Blogroll

These are the Blogs which I started as a Hobby: http://dls-joy.blogspot.in/ http://depaspi.blogspot.in/

About

These are the collections of various articles related to Education, Science, Technology, General Knowledge, Wonders etc.,from News Papers, magazines, journals and web services like youtube videos etc.